వందేమాతరం దేశ చరిత్రలో నూతన అధ్యాయం – వశిష్ట విద్యాసంస్థల డైరెక్టర్ వి. సత్యనారాయణ గౌడ్
నిర్మల్: బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చేందుకు భారతీయులను ఉద్యమం వైపు దూసుకెళ్లేలా ఏకం చేసిన మహత్తర గీతం వందేమాతరం అని వశిష్ట విద్యాసంస్థల డైరెక్టర్ వి. సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు.
వందేమాతర గీతం 150వ వార్షికోత్సవం సందర్భంగా దేశ ప్రజల్లో దేశభక్తి స్ఫూర్తిని నింపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఆ పిలుపుని అందుకొని దేశవ్యాప్తంగా ప్రజలు వందేమాతర గీతాన్ని ఆలపించడం భారత చరిత్రలో నూతన అధ్యాయమని అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని వశిష్ట జూనియర్ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు, ప్రిన్సిపాల్‌లతో కలిసి వందేమాతర గీతాన్ని స్వయంగా ఆలపించిన సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, “స్వాతంత్ర్య ఉద్యమంలో వందేమాతర గీతం మహామంత్రంలా పని చేసింది. ఉద్యమంలో దూకేందుకు ప్రజలకు ప్రేరణనిచ్చింది,” అని పేర్కొన్నారు.
బెంగాలీ రచయిత బంకిమ్ చంద్ర చటర్జీ రాసిన ఆనందమఠం నవలలో ఈ గీతం చోటు చేసుకుందని, 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటిసారి దీనిని ఆలపించారని గుర్తు చేశారు. ఈ గీతం భారతీయుల్లో స్వాతంత్ర్య జ్యోతి రగిలించిందని తెలిపారు.
దేశ ప్రజలందరిలో దేశభక్తి మరింత పెరగాలని, నవభారత నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వశిష్ట జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మహేష్ కుమార్, వశిష్ట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అఖిలేష్ కుమార్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు గీతాన్ని ఆలపించి నూతన ఉత్తేజాన్ని పొందారు.