రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తన కార్యకలాపాలను విస్తరిస్తూ, సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా లెక్కల ధరణి కుమార్ ను నియమించింది. కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాలకు కొట్టం హరి ప్రసాద్, మంకముతక మంజునాథ్ లను కో-ఆర్డినేటర్లుగా నియమించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఈ నియామకాలను ఆమోదించారు.
ఆంధ్రప్రదేశ్‌లో మూడవ ప్రత్యామ్నాయ శక్తిగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ బలోపేతం అవుతోందని, 2029 ఎన్నికల్లో చట్టసభలకు కొత్తవారిని పంపించడమే లక్ష్యంగా పనిచేస్తోందని పార్టీ ఏపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ పంగులూరి బుచ్చిబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. కొమ్మోజు రమేష్ తెలిపారు. ఈ మేరకు 175 అసెంబ్లీ స్థానాలకు కో-ఆర్డినేటర్లను, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు కన్వీనర్లను, 28 కొత్త జిల్లాలకు అధ్యక్ష, కార్యదర్శులను నియమించే ప్రక్రియ కొనసాగుతోందని వారు పేర్కొన్నారు.
కదిరి బస్ స్టాండ్ సెంటర్లోని హోటల్ అత్తార్ రెసిడెన్సీలో జరిగిన కార్యక్రమంలో, పంగులూరి బుచ్చిబాబు, కొమ్మోజు రమేష్‌ల సిఫార్సు మేరకు మేడా శ్రీనివాస్ చేతుల మీదుగా నియమితులైన వారికి అధికారిక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మానవ హక్కులు, మానవతా విలువలు రోజురోజుకు నిర్వీర్యం అవుతున్నాయని, రాష్ట్ర సంపద ఇతర రాష్ట్రాల రాజకీయ ప్రయోజనాలకు, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థల ఆర్థిక స్వలాభాలకు దోచుకుపోతోందని విమర్శించారు. రాష్ట్ర సంపదను ప్రజల అభ్యున్నతికి, భవిష్యత్తుకు ఉపయోగించే విధంగా, పేదరికం లేని సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని, దీనికి ప్రజా చైతన్యంతో కూడిన ఉద్యమం తప్పదని ఆయన తెలిపారు.
కొత్తగా నియమితులైన లెక్కల ధరణి కుమార్, కొట్టం హరి ప్రసాద్, మంకముతక మంజునాథ్ లు మాట్లాడుతూ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని ఒక తిరుగులేని శక్తిగా బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. అధినేత మేడా శ్రీనివాస్ ఆశయ సాధనతోనే ఆంధ్రప్రదేశ్‌కు అద్భుతమైన భవిష్యత్, భద్రత ఉంటుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వంకర మురళి నాయుడు, ధర్మవరపు శ్రీనివాసరావు, ఎస్.కె. హాసన్ వలి తదితరులు పాల్గొన్నారు.


