నిర్మల్ జిల్లాలోని స్వప్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యులు ఒక అరుదైన వెన్నుముక శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. 11 సెంటీమీటర్ల స్పైనల్ ట్యూమర్‌ను తొలగించడం ద్వారా ఈ వైద్య విజయం సాధించారు.
లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల నాగ భూషణ్ అనే వ్యక్తి దీర్ఘకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందినప్పటికీ ఉపశమనం లభించకపోవడంతో స్వప్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని సంప్రదించారు.
జనరల్ సర్జన్ డాక్టర్ నాళం శశికాంత్, న్యూరో సర్జన్ డాక్టర్ సచిన్ సంయుక్తంగా పరీక్షలు నిర్వహించి, ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా వెన్నుపూసలో D3 నుండి D8 వర్టిబ్రాల మధ్య 11 సెంటీమీటర్ల స్పైనల్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారించారు.
రోగి బంధువులకు శస్త్రచికిత్సలోని రిస్కులను వివరించి, వారి అనుమతితో లామినోటోమి, లామినోప్లాస్టీ టెక్నిక్లను ఉపయోగించి ట్యూమర్‌ను తొలగించారు. సర్జరీ అనంతరం వెన్నుపూస నరాలకు ఎటువంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
వైద్యుల కథనం ప్రకారం, ఇలాంటి ట్యూమర్లు అరుదుగా వస్తాయని, సకాలంలో చికిత్స చేయకపోతే నడవడంలో ఇబ్బందులు, పక్షవాతం వంటి తీవ్ర పరిణామాలు సంభవించవచ్చని తెలిపారు. ఈ శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ పథకం కింద నిర్వహించడం విశేషం.


