ఇరాన్ వంటి దేశాలపై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని తక్షణమే ఆపాలని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నియంతృత్వాన్ని విడనాడాలని ఆయన అన్నారు.
గురువారం ఆయన మాట్లాడుతూ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడితో చర్చలు జరిపారని పేర్కొన్నారు. ఇరాన్, ఇరాక్, వెనిజులా వంటి చిన్న దేశాలపై, ముఖ్యంగా ముడి చమురు నిల్వలున్న దేశాలపై అమెరికా ఆధిపత్యం పెరిగిపోయిందని గోవింద్ నాయక్ ఆరోపించారు.
ఆయా దేశాల్లోని ఖనిజ సంపద, సహజ వనరులను దోచుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ యుద్ధాల వల్ల చిన్న దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే ఈ దాడులను నిలిపివేయాలని, శాంతియుత మార్గాలను అన్వేషించాలని ఆయన కోరారు. అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


