ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2026 ను గెలుచుకున్న భారత జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నగదు బహుమతిని ప్రకటించింది. ఈ విశ్వవిజేత జట్టుకు రూ. 131 కోట్లు బహుమతిగా అందజేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటించారు. ఇది 2024 టీ20 వరల్డ్ కప్ విజేతలకు ప్రకటించిన మొత్తం కంటే రూ. 6 కోట్లు ఎక్కువ.
భారత జట్టు న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి, వరుసగా రెండో టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో మరో మైలురాయిగా నిలిచింది. భారత్ మొత్తం మూడు టీ20 వరల్డ్ కప్ టైటిళ్లను (2007, 2024, 2026) గెలుచుకుంది.
ఫైనల్ మ్యాచ్‌లో, భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. సంజు శాంసన్ (89), అభిషేక్ శర్మ (52), ఇషాన్ కిషన్ (54) అర్ధశతకాలతో రాణించారు. చివర్లో శివమ్ దూబే మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు స్కోరును 255/5 కి చేర్చాడు.
256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్, భారత బౌలర్ల ధాటికి 159 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయారు. ఓపెనర్ సీఫెర్ట్ (52) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు.


