రాష్ట్రంలో రానున్న ఉగాది, రంజాన్ పండుగ సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉగాది, రంజాన్ పండుగలకు వరుస సెలవులు వస్తుండటంతో, సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడానికి టీజీఎస్ఆర్టీసీ పూర్తి సన్నద్ధతతో ఉంది. ఈ పండుగలకు ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం ఇప్పటికే నిర్ణయించింది. ముఖ్యంగా మార్చి 17, 18 తేదీలలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ఆయా రోజుల్లో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశారు. అలాగే, మార్చి 23వ తేదీన తిరుగు ప్రయాణ రద్దీకి సంబంధించి కూడా తగిన ఏర్పాట్లు చేశారు.
ప్రత్యేక బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం 2003లో జీవో నంబర్ 16 ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే టికెట్ ధరలను 1.5 రెట్లు వరకు సవరించుకునే వెసులుబాటు సంస్థకు ఉంది. ఈ ఉగాది, రంజాన్ పండుగ సెలవులకు నడిపే ప్రత్యేక బస్సులకు ఈ నిబంధనల ప్రకారం రూ.1.5 వరకు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సవరించింది.
ఈ సవరించిన ఛార్జీలు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే వర్తిస్తాయి. మార్చి 17, 18 తేదీలతో పాటు, తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 23వ తేదీన మాత్రమే సవరించిన చార్జీలు అమల్లో ఉంటాయి. స్పెషల్ బస్సులు మినహా, రెగ్యులర్ బస్సుల్లో యథావిధిగా సాధారణ ఛార్జీలే అమల్లో ఉంటాయి.
రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకం కింద, ఉగాది, రంజాన్ పండుగ రోజుల్లో నడిచే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా కొనసాగుతుంది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లను www.tgsrtcbus.in వెబ్ సైట్ లో బుక్ చేసుకోవాలని యాజమాన్యం తెలిపింది.










