రాష్ట్రంలో అకాల వర్షాలు మొదలయ్యాయి. సోమవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. రాబోయే వారం రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, వడగండ్లు, పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రాష్ట్రంలోని సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. దీనివల్ల పంటలు దెబ్బతిన్నాయి. హైదరాబాద్ నగరంలోనూ చిరుజల్లులు నమోదయ్యాయి.
సంగారెడ్డి జిల్లా పల్వట్లలో అత్యధికంగా 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 2.8, సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో 2.5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, వడగండ్లు, పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.
ముఖ్యంగా బుధ, గురువారాల్లో వర్షాల తీవ్రత, వడగండ్ల ముప్పు ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ నగరంలోనూ రాబోయే వారం రోజుల పాటు సాయంత్రం వేళల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.





