త్యాగధనుడు వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే

త్యాగధనుడు వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే

స్వాతంత్ర్య సమరయోధుడు వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే జయంతి వేడుకలు

గాంధీ బాలా సేవా సంఘం ఆధ్వర్యంలో సంస్మరణ సభ

గౌతమి హైస్కూల్లో ఘనంగా నివాళులు

ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన ఫడ్కే సేవలు స్ఫూర్తిదాయకం

మనోరంజని తెలుగు టైమ్స్ భైంసా ప్రతినిధి నవంబర్ 04

వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే త్యాగధనుడని గాంధీ బాలా సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జాధవ్ పుండలిక్ రావు పాటిల్ అన్నారు. ఫడ్కే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శ్రీ గౌతమి హైస్కూల్లో నిర్వహించిన సంస్మరణ సభలో పాటిల్ పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫడ్కే జీవిత చరిత్ర స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. 1845 నవంబర్ 4న ఒక పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే చిన్ననాటి నుంచే ప్రజలకు సేవచేయాలనే తపన కలవాడని తెలిపారు. 1876–77లో మహారాష్ట్రలో వచ్చిన భయంకరమైన కరువు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిందని, ప్రజల ఆకలికి కారణమైన బ్రిటిష్ పాలకుల నిర్లక్ష్యం ఆయనను తిరుగుబాటుకు ప్రేరేపించిందని చెప్పారు. ఫడ్కే స్థానిక కోలీ, బీల్, ధంగార్ వర్గాల ప్రజలను ఒకచోట చేర్చి రామొషి అనే దళాన్ని ఏర్పాటు చేశాడు. బ్రిటిష్ ధనవంతులపై దాడి చేసి ప్రజల ఆకలి తీర్చడంలో సహకరించాడు. అతని ధైర్యం, నిబద్ధత బ్రిటిష్ ప్రభుత్వానికి భయాందోళన కలిగించాయి. గవర్నర్ సర్ రిచర్డ్ టెంపుల్ ఫడ్కేను పట్టివ్వగలవారికి బహుమతిని ప్రకటించగా, ఫడ్కే దానికి ప్రతిసవాలుగా గవర్నర్ను పట్టుకొస్తే తనవద్ద నుంచి మరింత బహుమతి ఇస్తానని చెప్పారు. బ్రిటిష్ మరియు నిజాం సైన్యాలు కలిసి ఫడ్కేను పట్టుకునే ప్రయత్నాలు చేశాయి. చివరికి అనారోగ్యంతో అలసిపోయిన ఫడ్కే పట్టుబడి జైల్లో మరణించాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఫడ్కే త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పాటిల్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment