నిర్మల్, జులై 30
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆలూరు గ్రామ సర్పంచ్ ఇర్ల చిన్నయ్య, ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసరంగా బయటకు రావద్దని, విద్యుత్ ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలని, వాగులు వంకలు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆలూరు గ్రామ పంచాయతీ ప్రజలకు, ప్రజలందరికీ నమస్కారం. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని గ్రామ సర్పంచ్ ఇర్ల చిన్నయ్య కోరారు. భారీ వర్షాల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున, ప్రజల ప్రాణ రక్షణ కోసం కింది జాగ్రత్తలు తప్పక పాటించాలని సూచించారు.
వర్షం ఎక్కువగా ఉన్నప్పుడు అనవసరంగా ఇళ్ల నుండి బయటకు రావద్దని, పిల్లలను, వృద్ధులను వర్షంలో తడవకుండా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. కరెంటు స్తంభాలు, కరెంటు తీగలు, విరిగిపడిన వైర్లు మరియు ట్రాన్స్ఫార్మర్ల వద్దకు వెళ్లవద్దని, తడి చేతులతో విద్యుత్ ఉపకరణాలను తాకవద్దని హెచ్చరించారు.
వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించే కల్వర్టులు మరియు రోడ్లపై నిలిచిన నీటి గుండా దాటే ప్రయత్నం అస్సలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణ భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని, అత్యవసర పరిస్థితి ఉంటే వెంటనే స్థానిక నాయకులను లేదా అధికారులను సంప్రదించాలని తెలిపారు.












