ఖానాపూర్, జూలై 30
ఖానాపూర్ మండలంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఎంపీడీవో రాధా రాథోడ్ సూచించారు. వాగులు, నది పరివాహక ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
ఖానాపూర్ మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఖానాపూర్ మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) రాధా రాథోడ్ సూచించారు. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
మండల పరిధిలోని వాగులు, చెరువులు, కుంటలు, గోదావరి నది పరివాహక ప్రాంతాలకు రైతులు, రైతు కూలీలు, పశువుల కాపర్లు వెళ్లకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదని హెచ్చరించారు.
భారీ వర్షాల దృష్ట్యా గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లకు మైక్ అనౌన్స్మెంట్లు, టామ్‌టామ్ నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
ప్రజల సహకారం, అధికారుల సమన్వయంతో ఈ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలను పాటించాలని ఎంపీడీవో రాధా రాథోడ్ కోరారు.












