కుంటాల పోలీస్ స్టేషన్ పరిధిలోని దోనేల్లి గ్రామానికి చెందిన పున్న మహేందర్ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో విజయవంతంగా ఛేదించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న బాల నేరస్థుడిని చట్ట ప్రకారం అదుపులోకి తీసుకున్నట్లు భైంసా అదనపు పోలీసు అధికారి సాయి కిరణ్ తెలిపారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్ 18న దోనేల్లి గ్రామ శివారులోని బావి వద్ద పున్న మహేందర్‌ను బాల నేరస్థుడు వెనుక నుంచి తోసివేయడంతో అతను బావిలో పడి మృతి చెందాడు. అనంతరం ఏప్రిల్ 23న బావిలో మృతదేహం లభించడంతో కుంటాల పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతుడి తల్లి జిల్లా పోలీసు అధికారి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో కేసును ప్రత్యేక దృష్టితో పునఃపరిశీలించి, అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర శాస్త్రీయ ఆధారాలను సమగ్రంగా పరిశీలించి విచారణ నిర్వహించారు.
దర్యాప్తులో బాల నేరస్థుడు మృతుడు పున్న మహేందర్ బ్యాంకు ఖాతా నుంచి మోసపూరితంగా కొంత మొత్తాన్ని తన ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు గుర్తించారు. ఈ విషయమై మహేందర్ డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదే కక్షతో మహేందర్‌ను బావి వద్దకు తీసుకెళ్లి వెనుక నుంచి తోసివేయడంతో అతను మృతి చెందినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో సేకరించిన విశ్వసనీయ సాక్ష్యాధారాలు, సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా బాల నేరస్థుడి ప్రమేయం నిర్ధారణ కావడంతో జూలై 29న అతడిని చట్ట ప్రకారం అదుపులోకి తీసుకుని తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఈ కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన భైంసా గ్రామీణ పోలీసు ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, కుంటాల ఉప పోలీసు ఇన్స్పెక్టర్ నరేష్‌తో పాటు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందిని భైంసా అదనపు పోలీసు అధికారి సాయి కిరణ్ అభినందించారు.












