సోషల్ మీడియాలో అసత్య, ద్వేషపూరిత పోస్టులు చేసి ప్రజాశాంతికి భంగం కలిగించిన అంబేకార్ వర ప్రసాద్ అనే వ్యక్తిని నిర్మల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.
నిర్మల్ పట్టణానికి చెందిన అంబేకార్ వర ప్రసాద్ గత కొన్ని రోజులుగా ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాలపై రెచ్చగొట్టే విధంగా అసత్య ప్రచారాలు చేస్తూ పోస్టులను వైరల్ చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, నిందితుడు వివిధ రాజకీయ వర్గాల మధ్య విద్వేషాలు, శత్రుత్వాలు పెరిగేలా, ప్రజల్లో అపోహలు సృష్టించేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో అతడిని అరెస్ట్ చేశారు.
నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో అసత్యాలు, ద్వేషపూరిత సందేశాలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా సమాచారాన్ని ఫార్వర్డ్ చేసే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని సూచించారు.
కేసు ఛేదనలో కృషి చేసిన అధికారులను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ అభినందించారు. సైబర్ నేరాలపై, సోషల్ మీడియా దుర్వినియోగంపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారని, చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలుంటాయని ఎస్పీ స్పష్టం చేశారు.












