జనగామ, 28 July
జనగామ జిల్లాలో దారుణం జరిగింది. మూడోసారి ఆడపిల్ల అని తెలియడంతో అబార్షన్ చేయించుకున్న ఓ మహిళ తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. అబార్షన్ చేసిన ఏఎన్ఎం, ఆర్ఎంపీలను అదుపులోకి తీసుకోగా, తల్లి, స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు పరారీలో ఉన్నారు.
మూడోసారి ఆడపిల్ల అని తెలియడంతో అబార్షన్ చేయించుకున్న ఓ మహిళ తీవ్ర రక్తస్రావంతో మృతి చెందిన విషాదకర సంఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. మహిళ మృతికి కారణమైన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన భాస్కర్ గౌడ్, దేవరుప్పుల మండలం కొలుకొండ గ్రామానికి చెందిన శ్రావణి (35) దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ భాస్కర్ గౌడ్ జీవనం సాగిస్తున్నాడు.
శ్రావణి మూడోసారి గర్భం దాల్చడంతో కొద్ది రోజులుగా తల్లిగారింట్లో ఉంటోంది. ఇటీవల శ్రావణి, ఆమె తల్లి శోభలు హనుమకొండలోని ఒక ప్రైవేట్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ నిర్వాహకుడు ప్రవీణ్ వద్దకు వెళ్లారు. పరీక్షించిన ప్రవీణ్, కడుపులో ఆడపిల్ల ఉందని చెప్పాడు. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండటంతో, మళ్లీ అమ్మాయి అని తెలియడంతో అబార్షన్ చేయించాలని దంపతులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కొలుకొండకు చెందిన ఆర్ఎంపీ రచ్చ శ్రావణ్ కుమార్ సహకారంతో జనగామలోని సంజయ్ నగర్ కు చెందిన ప్రైవేట్ ఏఎన్ఎం అనసూయను సంప్రదించారు.
ఏఎన్ఎం అనసూయ ఈ నెల 21వ తేదీన తన ఇంట్లోనే శ్రావణికి అబార్షన్ చేసింది. ఆ తర్వాత శ్రావణికి తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున శ్రావణి మృతి చెందింది. భర్త భాస్కర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఏఎన్ఎం అనసూయ, ఆర్ఎంపీ రచ్చ శ్రావణ్ కుమార్ ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అబార్షన్‌కు ప్రోత్సహించిన మృతురాలి తల్లి శోభ, స్కానింగ్ చేసిన డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకుడు ప్రవీణ్ పరారీలో ఉన్నారని జనగామ సీఐ సత్యానారాయణ రెడ్డి తెలిపారు.












