నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వన్నెల్కే గ్రామంలోని గ్రేస్ ఫెల్లో పాఠశాలలో కంటైనర్లలో విద్యార్థులకు బోధన నిర్వహిస్తున్నారని, దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి ఆరోపించారు.
పాఠశాలలో సరైన తరగతి గదులు, క్రీడా మైదానం, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు వంటి కనీస సౌకర్యాలు లేకపోయినా సంబంధిత నందిపేట్ ఎంఈఓ పాఠశాల అనుమతికి జిల్లా విద్యాశాఖకు సిఫారసు చేయడం ప్రశ్నార్థకమని ఆయన అన్నారు. పాఠశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా చెక్లిస్టులు, విజిట్ రిపోర్టులపై సంతకాలు చేసి పంపడం, అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో పరిశీలించకుండా అనుమతులు మంజూరు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.
కార్పొరేట్ పాఠశాల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ, అన్ట్రెయిన్డ్ టీచర్లతో బోధన నిర్వహిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఎంఈఓపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని, వన్నెల్కేలోని గ్రేస్ ఫెల్లో పాఠశాల అనుమతిని వెంటనే రద్దు చేయాలని కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు.












