కరీంనగర్, 2023-07-29
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అటవీ శాఖ అధికారి ఇంట్లో జరిగిన సుమారు రూ.26 లక్షల నగదు దొంగతనం కేసులో మాజీ జడ్పీటీసీ సభ్యురాలి భర్తపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్ రూలర్ పోలీస్ స్టేషన్ లో ఒక విచిత్రమైన దొంగతనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటవీ శాఖ అధికారి ఇంట్లో బీరువాలో దాచిన సుమారు రూ.26 లక్షల నగదు దొంగలించబడింది. ఈ ఘటనలో అనుమానితుడిగా ఉన్న వ్యక్తి మాజీ జడ్పీటీసీ సభ్యురాలి భర్త కావడం గమనార్హం.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్ పూర్ కు చెందిన అటవీశాఖ అధికారి గుడిమల్ల శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా తీగల గుట్ట మణికేశ్వర నగర్ లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇటీవల తన స్వగ్రామంలో ఉన్న వ్యవసాయ భూమిని రూ.26 లక్షలకు విక్రయించారు. ఆ నగదును తన అద్దె ఇంటిలో భద్రపరిచారు.
గత నెల చివరి వారంలో డబ్బు అవసరం రావడంతో ఇంటికి వెళ్లి బీరువాను చూడగా, తాళం ధ్వంసం చేసి ఉంది. అందులో దాచిన రూ.26 లక్షలు మాయమయ్యాయని తెలుసుకున్నారు. గతంలో తన ఇంట్లో ల్యాప్ టాప్ దొంగతనం చేసిన వ్యక్తే ఈసారి నగదును కూడా ఎత్తుకెళ్లారని బాధితుడు నిర్ధారణకు వచ్చారు.
అదేవిధంగా, గత నెలలో తన ఇంటికి వచ్చి వెళ్లిన తన స్నేహితుడు, మంథని జడ్పీటీసీ మాజీ సభ్యురాలు భర్త తగరం శంకర్ లాల్ దొంగతనం చేసి ఉంటాడని అనుమానించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు శంకర్ లాల్ దొంగతనం చేసినట్లు నిర్ధారించి, మంగళవారం సాయంత్రం అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఈ దొంగతనంలో మరికొందరి హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.











