నిర్మల్ రూరల్, జూలై 29
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. రానున్న రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భారీ వర్షాలు, రక్షణ చర్యలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రానున్న రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, ఇతర నిర్మాణాలను వెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.
వాగులు, చెరువులు, కుంటలు, లోతట్టు ప్రాంతాలకు పశుకాపరులు, మత్స్యకారులు, ప్రజలు వెళ్లకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామపంచాయతీ స్థాయిలో వర్షపాతం, చెరువుల నీటిమట్టం వివరాలను ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కల్పించాలని సూచించారు.
వర్షాకాలంలో కాలానుగుణ వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, ఫాగింగ్, డ్రైడే కార్యక్రమాలు, దోమల నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడంతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించాలని పేర్కొన్నారు.
సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డీఆర్వో రాథోడ్ రమేష్, ఆర్డీఓ దేవీదాస్, డీఆర్డీఓ విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ రాజేందర్, డీపీవో శ్రీనివాస్, ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.












