హైదరాబాద్, 29 July
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర ఒడిశా తీరంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర ఒడిశా భూ ఉపరితలంపై కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలో ఈ వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వీస్తాయని పేర్కొంది.
ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ నెల 30, 31 తేదీల్లో కూడా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. కాగా, మంగళవారం సాయంత్రం హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది.
రాబోయే రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ ప్రత్యామ్నాయ ప్రణాళిక, వనమహోత్సవం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో మంగళవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుండి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఐదు, ఆరు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, 26 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని అన్నారు. వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యామ్నాయ ప్రణాళికలో భాగంగా జిల్లాల్లో విత్తన మేళాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల విషయంలో ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.












