బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో పాటు, వాయుగుండం కదులుతున్న దిశను బట్టి వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం ఉత్తర ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై కేంద్రీకృతమై పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే మూడ్రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
గత 24 గంటల్లో మెదక్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్లు అధికారులు చెప్పారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో అత్యధికంగా 9.64 సెం.మీ, మెదక్ జిల్లా చేగుంటలో 8.11 సెం.మీ, మెదక్లో 7.68 సెం.మీ, శంకరంపేటలో 6.71 సెం.మీ, జయశంకర్భూపాలపల్లి జిల్లా పాలెంలలో 6.90 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 6.14 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు వివరించారు. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గురు, శుక్రవారాల్లోనూ బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఎల్ నినో కారణంగా జూన్, జూలై నెలల్లో -49 సెం.మీ లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడించాయి. మరోవైపు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకల్లోకి వరద పెరుగుతోంది. సిరికొండ మండలంలో కప్పల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బ్రిడ్జి వద్ద వరద ప్రవాహానికి అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది.
భారీ వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి 6585 క్యూసెక్కుల వరద నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు, 17.802 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1395.40 అడుగులు, 7.139 టీఎంసీలుగా నమోదైంది. గత ఏడాది ఇదే రోజు ప్రాజెక్టులో నీటిమట్టం 1391.25 అడుగులు, 4.597 టీఎంసీలుగా ఉన్న విషయం తెలిసిందే. అటు మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లోలో 27,000 క్యూసెక్కులు, ఔవుట్ ఫ్లోలో 28,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లకు గాను ప్రస్తుత నీటి మట్టం 317.240 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 7.17 టీఎంసీలుగా నమోదైంది. వరద ప్రవాహం నేపథ్యంలో ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో పది యూనిట్లలో 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.












