మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 24
ఇందూరు జిల్లాలోని వేల్పూర్ శివారులో గల గోవిందగిరి దివ్య యోగాశ్రమంలో ఆషాడ మాస గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు సాగుతున్న ఈ వేడుకల్లో భజన కళాకారులు సప్త భజనలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. చివరి రోజున ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ రాఘవేంద్ర స్వామి ఆశీర్వచనాలు అందించారు.
ఇందూరు జిల్లాలో ఆశ్రమాలయాలకు కొదవలేదు. వేల్పూర్ శివారులో గల గోవిందగిరి దివ్య యోగాశ్రమంలో ఆషాడ మాసంలో నిర్వహించే గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధ, గురువారం రెండు రోజులు భజన కళాకారులు సప్తభజనల్లో నిమగ్నమై తమ ప్రతిభ పాటవాల్ని ప్రదర్శించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శుక్రవారం మూడవరోజు మోతె, రావుట్ల, ఆర్మూర్, గోవింద్ పేట్ గ్రామాలకు చెందిన భజన బృందాల కళాకారులు పోటా పోటీగా పాల్గొని తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. విలక్షణ శైలిలో భజన పాటలు పాడి కార్యక్రమానికి వన్నె తెచ్చారు.
"నమ్ము ప్రభూ దర్శనం ఆత్మ సందర్శనం గురుదేవా.. నమ్మి యున్నాను మహానుభావా, అయ్యా ఎన్నెన్నో జన్మములెత్తి నేను తల్లిదండ్రులను మరిచి వస్తి... హరవో నమశ్శివాయనరా, ఒక్కడే దేవుడురా..." అంటూ భజన పాటలు పాడి ఆనంద సాగరంలో ముంచెత్తారు. వేల్పూర్ కు చెందిన పన్నాల అరుణ, యమునవ్వ కుటుంబ సభ్యులు గురుపాదుకాపూజ చేశారు.
ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ రాఘవేంద్ర స్వామి మాట్లాడుతూ, ఈ సప్త భజనలతో సమస్త ప్రజలందరూ ఆయురారోగ్యాలతో బాసిల్లాలని, వర్షాలు సకాలంలో కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, పశుసంపద క్షేమంగా ఉండాలని, కరువు కాటకాలు రాకూడదని ఆకాంక్షించారు.
తదనంతరము శ్రీ రాఘవేంద్ర స్వామి వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన కళాకారులకు లడ్డు ప్రసాదాల్ని ఇచ్చి, చిన్న జ్ఞాపికల్ని బహుకరించారు. ఈ బృహత్తరమైన కార్యక్రమంలో కమిటీ సభ్యులు, స్వామి శిష్యులు, భజన కళాకారులు, సాయి సేవకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.












