మిర్యాలగూడ, జూలై 7
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న యూరియా యాప్ తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే దానిని రద్దు చేయాలని రైతు బంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షులు, మిర్యాలగూడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. నిరక్షరాస్యులు, స్మార్ట్ ఫోన్లు లేని రైతులకు యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవడం కష్టంగా మారిందని ఆయన ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన యూరియా యాప్ వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతు బంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షులు, మిర్యాలగూడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉన్నారని, వీరిలో ఎక్కువగా నిరక్షరాస్యులు ఉన్నారని, చాలామందికి స్మార్ట్ ఫోన్లు లేవని యూరియా బుకింగ్ చేసుకోవడం ఇబ్బందిగా మారిందని తెలిపారు.
ఈ విషయంపై ఐదు నెలల క్రితం హైకోర్టులో ప్రజా ప్రయోజనార్థం పిల్ వేయడం జరిగిందని తెలిపారు. దీంతో హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని యూరియా యాప్ పై సమాధానం ఇవ్వాలని ఆదేశించిందని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది మసిపూసి మారేడు కాయ లాగా నివేదికను హైకోర్టుకు సమర్పించారని అందులో ఏమీ లేదని పేర్కొన్నారు.
రైతులకు యూరియా అందించేందుకు ఎన్.డి.సి.ఎం.ఎస్, పి.ఏ.సి.ఎస్. కేంద్రాలతో పాటు ఎరువుల డీలర్లు, ఎరువుల దుకాణాలు వివరాలను పొందుపరిచారని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని మీ సేవ కేంద్రాల్లో కూడా యూరియా బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. దాని వలన రైతులకు యూరియా దొరికే పరిస్థితి లేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరైన సమయంలో యూరియాను అందించడంలో వైఫల్యం చెందిందని దీనిని కప్పిపుచ్చుకునేందుకే యూరియా యాప్ తీసుకువచ్చారని ఆరోపించారు. దీనివలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని హైకోర్టు దృష్టికి తీసుకు వెళ్లేందుకే ఫీల్ వేయడం జరిగిందని పేర్కొన్నారు. వరి సేద్యం చేసిన రైతులు సరైన సమయంలో యూరియా వెయ్యనట్లయితే పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయని, తద్వారా రైతులు ఒకవైపు పెట్టుబడులు పెరిగిపోయి మరోవైపు దిగుబడులు తగ్గి నష్టాల ఊబిలో కూరుకు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా అసైన్డ్ భూములలో వరి సాగు చేసే రైతులు, కౌలు రైతులకు యూరియా దొరికే పరిస్థితి లేదని పేర్కొన్నారు. దీనికి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కార మార్గాన్ని చూపలేదన్నారు. తాను హైకోర్టులో పిల్ వేయడం వలన గతంలో జిల్లా మొత్తం యూనిట్‌గా తీసుకొని యూరియా బుకింగ్ ఉన్నదని, తాను హైకోర్టులో పిల్ వేసిన తర్వాత మండల వారీగా యూరియా యాప్ ను మార్చారని తెలిపారు.
ఏది ఏమైనా రైతుల కష్టాలు తీరాలంటే తెలంగాణ ప్రభుత్వం వెంటనే యూరియా యాప్ ను రద్దు చేసి గతంలో పదేళ్లపాటు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని దుకాణాలలో యూరియా అందించినట్లుగానే ప్రస్తుతం అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ వానకాలం సీజన్లో డిఏపి బస్తాలను ఎరువుల వ్యాపారులు ఎంఆర్పి ధరలకు విక్రయించాలన్నారు. కాంప్లెక్స్ ఎరువులను వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని, అధిక ధరలను అరికట్టడంలో వ్యవసాయ అధికారులు వైఫల్యం చెందారని తెలిపారు.












