హైదరాబాద్, జూలై 7
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి ఉద్యమకారులతో హైదరాబాద్లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, ఉద్యమకారుల త్యాగాలకు తగిన గుర్తింపు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కమిటీ అధ్యక్షుడు కే. కేశవరావు తెలిపారు.
తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రంలోని అమరజ్యోతి ప్రాంగణంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి ఉద్యమకారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు కే. కేశవరావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు, ఉద్యమకారులు చేసిన త్యాగాలు, పోరాటాలకు తగిన గుర్తింపు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి ఉద్యమకారుడి వివరాలను పారదర్శకంగా పరిశీలించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
శాసన మండలి సభ్యులు ఆచార్య కోదండరాం మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉస్మానియా విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించిందని, ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి సేవలను గుర్తించి గౌరవించడం సమాజ బాధ్యత అని అన్నారు.
శాసన మండలి సభ్యుడు అద్దంకి దయాకర్, మాజీ శాసన మండలి సభ్యుడు రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి తదితరులు కూడా మాట్లాడుతూ, ఉద్యమకారుల అభిప్రాయాలను తెలుసుకుని న్యాయమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.
ఈ సమావేశానికి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరై, ఉద్యమంలో తమ పాత్ర, ఎదుర్కొన్న అనుభవాలు, గుర్తింపు ప్రక్రియపై తమ అభిప్రాయాలు, సూచనలను కమిటీ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు.












