నిజామాబాద్, 17 July
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల తహసీల్దార్ సంతోష్ రెడ్డిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెండ్ చేశారు. అసైన్మెంట్ భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో కలెక్టర్ ఈ చర్యలు తీసుకున్నారు. ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా విచారణ జరిపి నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ సస్పెన్షన్ జరిగింది.
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల తహసీల్దార్ సంతోష్ రెడ్డిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అసైన్మెంట్ భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా విచారణ నిర్వహించి తన నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు. విచారణలో అక్రమాలు జరిగినట్లు గుర్తించడంతో కలెక్టర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
మండలంలోని పలు గ్రామాల్లో అసైన్మెంట్ భూముల ఆస్తి బదిలీ దరఖాస్తులను లబ్ధిదారులతో కుమ్మక్కై పట్టాలు చేస్తున్నారంటూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో సమగ్ర విచారణ చేపట్టిన అధికారులు అక్రమాలపై నివేదిక సమర్పించగా, కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకున్నారు.
గురువారం ఉదయం నందిపేట్ తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ రికార్డులను పరిశీలించి లోపాలను గుర్తించిన ఆమె తహసీల్దార్‌తో పాటు సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ భూములను కబ్జాలు, అక్రమాలకు గురికాకుండా కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదేనని స్పష్టం చేశారు.
విధుల్లో నిర్లక్ష్యం, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన కలెక్టర్, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా పాల్గొన్నారు.
ఉదయం తనిఖీ నిర్వహించి హెచ్చరించిన జిల్లా కలెక్టర్, సాయంత్రానికే తహసీల్దార్ సంతోష్ రెడ్డిని సస్పెండ్ చేయడం జిల్లా రెవెన్యూ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనతో అసైన్మెంట్ భూముల వ్యవహారాలపై అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.












