లోకేశ్వరం, జూలై 17
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను రైతులు గురువారం ముట్టడించారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, రోజుకు 12 గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 10 గంటలే సరఫరా అవుతోందని, అది కూడా లో-వోల్టేజ్‌తో ఉందని ఆరోపించారు.
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను రైతులు గురువారం ముట్టడించారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా రోజుకు 12 గంటల విద్యుత్ ఇవ్వాల్సి ఉండగా, కేవలం 10 గంటలే సరఫరా చేస్తున్నారని రైతులు ఆరోపించారు.
సరఫరా అవుతున్న విద్యుత్ కూడా లో-వోల్టేజ్‌తో ఉండటంతో మోటార్లు సరిగా పనిచేయడం లేదని, కరెంట్ వచ్చే సమయాలపై స్పష్టత లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో పంటలకు సకాలంలో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సబ్‌స్టేషన్‌కు చేరుకున్న రైతులు ఏఈ శివకుమార్‌ను నిలదీయగా, ఆయన సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మూడు రోజుల్లో విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
అయితే హామీ మేరకు సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధర్మాడి కపిల్, ఉపసర్పంచ్ లక్కంపల్లి ఫణిల్ రావు, మాజీ ఎంపీటీసీ జైసాగర్ రావు, రైతు నాయకులు సంతెనోళ్ల గంగాధర్, ముత్యం కమలాకర్ రావు, నాగరావు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.












