బాసర, జూలై 16
నిర్మల్ జిల్లా బాసరలో భర్తతో జరిగిన గొడవ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ, తన ఇద్దరు చిన్నారులతో కలిసి గోదావరి ఘాట్‌కు చేరుకుంది. అప్రమత్తమైన పోలీసులు సకాలంలో స్పందించి వారిని సురక్షితంగా తరలించి, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఇంట్లో భర్తతో జరిగిన కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ ఇద్దరు చిన్నారులతో కలిసి బాసర గోదావరి ఘాట్‌కు రావడంతో విషాదం తప్పింది. ఘాట్ వద్ద విధులు నిర్వహిస్తున్న బాసర పోలీసు సిబ్బంది అప్రమత్తంగా గమనించి వెంటనే వారిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ పట్టణంలోని రాంనగర్‌కు చెందిన ఉమాబాయి (30) తన భర్త శివాజీతో జరిగిన గొడవ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరి ఘాట్‌కు వచ్చింది. పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే స్పందించి ఆమెను, పిల్లలను సురక్షితంగా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.
అనంతరం కుటుంబ సభ్యులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. కుటుంబ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచిస్తూ మహిళను, పిల్లలను కుటుంబ సభ్యుల వెంట సురక్షితంగా పంపించారు.
కుటుంబ కలహాల కారణంగా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని, సమస్యలు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులు, పెద్దలు లేదా పోలీసుల సహాయం తీసుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు.












