హైదరాబాద్, జులై 07
రాష్ట్రంలో చికెన్, కోడిగుడ్ల ధరలు గణనీయంగా పెరిగి సామాన్యులకు భారంగా మారాయి. ఆదివారం కిలో చికెన్ ధర రూ. 350-360 మధ్య, బోన్ లెస్ చికెన్ రూ. 640 వరకు పలుకుతుండగా, డజను గుడ్ల ధర రూ. 90-100కు చేరుకుంది. దీంతో వినియోగదారులు తమ ఖర్చులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్రంలో చికెన్ ధరలు భగ్గుమంటున్నాయి. ఆదివారం కిలో స్కిన్ లెస్ చికెన్ రూ. 350 నుంచి 360 వరకు, బోన్ లెస్ చికెన్ రూ. 640 వరకు అమ్ముతున్నారు. ఎండాకాలంలో రూ. 300 వరకు పలికిన చికెన్ ధరలు వర్షాలు పడ్డాక తగ్గుతాయని భావించగా, ఆ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది.
సాధారణంగా వానాకాలంలో తగ్గే చికెన్ ధరలు ఈసారి మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. కోడిగుడ్ల ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఇటీవల వరకు రూ.80 లోపు దొరికిన డజను గుడ్లు ఇప్పుడు రూ.90 నుంచి 100 వరకు చేరుకున్నాయి. ఒక్కో గుడ్డు ధర రూ.8 నుంచి రూ.8.50 మధ్య పలుకుతోంది.
దీంతో ప్రతిరోజూ గుడ్లు వినియోగించే కుటుంబాలు ఖర్చును తగ్గించుకునే పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. వేసవి కాలం తర్వాత కోళ్ల ఉత్పత్తి తగ్గడం, పౌల్ట్రీ ఫీడ్ ధరలు పెరగడం, మార్కెట్లో సరఫరా తగ్గిపోవడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా వ్యాపారులు చెబుతున్నారు.
మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్లు, శుభకార్యాల సీజన్ కారణంగా డిమాండ్ పెరగడంతో కూడా ధరలు మరింత ఎగబాకుతున్నాయని అంటున్నారు. మార్కెట్లో కొంతమంది వ్యాపారుల ఆధిపత్యం కూడా ధరలపై ప్రభావం చూపుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో చికెన్, గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.












