రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో అవసరమైన నిర్మాణ, మరమ్మత్తు పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గోదావరి పుష్కరాలకు సంబంధించిన వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టే పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు.
పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. పుష్కర ఘాట్లు, రహదారులు, త్రాగునీటి ట్యాంకులు, లైటింగ్ వంటి మౌలిక సదుపాయాల నిర్మాణం, మరమ్మత్తు పనులు నాణ్యంగా చేపట్టాలని ఆదేశించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, జాప్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు.
అధికారులు పుష్కరాల సందర్భంగా భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన చోట్ల భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.












