తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన తొలి, మలిదశ ఉద్యమకారులను సన్మానించేందుకు మిర్యాలగూడలో జూన్ 2వ తేదీన నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని రాజకీయ జేఏసీ చైర్మన్ మాలి ధర్మ పాల్ రెడ్డి పిలుపునిచ్చారు.
మిర్యాలగూడలో జూన్ 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ సన్మాన సభ ఏర్పాట్లను సోమవారం స్థానిక అమరవీర స్తూపం వద్ద పరిశీలించిన అనంతరం జేఏసీ చైర్మన్ మాలి ధర్మ పాల్ రెడ్డి ఈ పిలుపునిచ్చారు. రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులను గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమానికి డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల నుండి ఉద్యమకారులు, కళాకారులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సభకు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని, వీరిలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వంటివారు ఉన్నారని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ సన్మాన సభలో సామాజికవేత్త డాక్టర్ జాడి రాజు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరథ నాయక్, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాడుగుల శ్రీనివాస్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు బొప్పని నాగేష్, సర్పంచ్ బెజ్జం సాయిలు, టీజేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు క్రాంతి కుమార్, బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు, బీసీ జేఏసీ కో కన్వీనర్ దాసరాజు జయరాజు, పలువురు జేఏసి నాయకులు పాల్గొంటారని సమాచారం.
ఉద్యమకారుల త్యాగాలను స్మరించుకుంటూ వారిని సన్మానించుకునే ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.










