నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) కింద జీతాల నుండి 1.5 శాతం చందా కోతలను తక్షణమే నిలిపివేయాలని, పూర్తి విధివిధానాలు ప్రకటించిన తర్వాతే అమలు చేయాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు కృష్ణ కాంత్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మే నెల జీతం నుండి EHS చందా కింద 1.5 శాతం కోత విధించడంపై తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి విధివిధానాలు ఖరారు కాకముందే, ఉద్యోగుల నమోదు ప్రక్రియ కూడా పూర్తి కాకముందే ఈ కోత విధించడం అన్యాయమని సంఘం నాయకులు పేర్కొన్నారు.
నల్గొండ జిల్లా అధ్యక్షులు కృష్ణ కాంత్ నాయక్ మాట్లాడుతూ, 'ఏ ఉత్తర్వుల ప్రకారం ఈ కోత విధించారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఎవరి జీతం నుండి డిడక్షన్ చేయాలనే దానిపై స్పష్టత లేదు, కానీ ప్రస్తుతం ఇద్దరి జీతం నుండి కోత పడుతోంది. EHS కార్డులు ఇంకా జారీ కాలేదు, ఏ ఆసుపత్రులు ఈ పథకంలో భాగమో కూడా తెలియదు' అని తెలిపారు.
ప్రభుత్వం అమలుకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి, అన్ని సందేహాలకు సమాధానం ఇచ్చిన తర్వాత అధికారిక మార్గదర్శకాలు విడుదల చేయాలని నాయక్ సూచించారు. ముందస్తు కోతలు విధించడం ఉద్యోగుల్లో అసంతృప్తికి దారితీసిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకుని, కోతలను నిలిపివేయాలని ఆయన కోరారు.
నాణ్యమైన EHS కోసం ఉద్యోగులు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారని, జీతం నుండి 1.5 శాతం కట్టడానికి అభ్యంతరం లేదని, అయితే గైడ్లైన్స్ లేకుండా, జూన్ నుండి కార్డులు ఇస్తామని చెప్పి, మే నెల నుండే ఎందుకు కోత విధించారని నాయక్ ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే ఉద్యోగుల పరిస్థితి ఏమిటని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.











