** (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
దేశ భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తున్నాయని, యువత తిరుగుబాటు నిరసనల నిప్పురవ్వ దావానలమైందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. గత 38 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్లో కొనసాగుతున్న నిరసన, యువతలో పెరుగుతున్న నిబద్ధత, పట్టుదల, క్రమశిక్షణను ప్రతిబింబిస్తోంది. ప్రభుత్వ అణచివేత, దుష్ప్రచారాలను ఎదుర్కొంటూ యువత పోరాటం చరిత్రలో నిలిచిపోయే సంఘటనగా మారుతోంది.
వెలుగుతున్న ఆశ ఒకవైపు, కొనసాగుతున్న అల్పత్వం మరోవైపు. నేడు దేశ కదలికను గమనిస్తుంటే భవిష్యత్తు పట్ల ఆశలు చిగురిస్తున్నాయి. ఏం చేయలేమనే నిరాశ నుంచి ఏదైనా చేయగలమనే ధైర్యం నిండుతోంది. మాకిక తిరుగులేదనుకున్నవారికి తలలు తిరిగేట్టు జరగటం చూస్తుంటే సామాజిక శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు, సిద్ధాంతాలు ఎంత వాస్తవికమైనవో అర్థమవుతున్నది. నిరసనల నిప్పురవ్వ అంటుకుంటే ఎంత దావానలమై ముంచెత్తుతుందో స్పష్టపరిచింది నేటి యువత తిరుగుబాటు.
గత 38 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్లో నిరవధికంగా జరుగుతున్న నిరసన అత్యంత పదునైన దీక్షతో కొనసాగటం అనేకమంది రాజకీయ నాయకులను, సామాజిక కార్యకర్తలను, సాధారణ ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నది. నిర్మాణ రూపమే లేని ఒక సోషల్ మీడియా ‘కాక్రోచ్’ యువత, ఇంత నిబద్ధంగా, పట్టుదలతో, క్రమశిక్షణతో ఉద్యమాన్ని నిర్మించడం చూస్తే, ఎక్కడ అణచివేత, దోపిడీ వేదన ఉంటుందో అక్కడ తిరుగుబాటు తప్పదన్న సత్యం రుజువుతున్నది. నిర్మాణాత్మక వామపక్ష విద్యార్థి ఉద్యమమూ తోడుగా చేరటము మరింత పదునుతేరుతున్నది. ఇదో శుభపరిణామం. ‘‘పదిమంది ఉక్కు గుండెలుగల యువకులను నాకివ్వండి, నేను ఈ దేశాన్ని మార్చివేస్తాను’’ అని స్వామి వివేకానంద చెప్పిన మాటలు ఈ సన్నివేశాన్ని చూస్తే ఎంతో నిజమని అర్థమవుతున్నది.
నిరసన చాలా సామాన్యంగానే ప్రారంభమైంది. ప్రభుత్వమూ పెద్దగా పట్టించుకోకుండా తేలికగానే చూసింది. జూలై ఇరవై తర్వాత నిరసన ఉద్యమ రూపం అందుకుంది. దేశవ్యాప్తంగా యువత కదం తొక్కింది. బీజేపీ తిరుగులేని ఆధిపత్యం వహిస్తున్న రాష్ట్రాల నుంచి అన్ని ప్రాంతాలలోనూ ప్రశ్నతో, నినాదంతో మార్మోగింది. ఇక్కడేకాదు, దేశం వెలుపల, అనేక దేశాలలో యువత మద్దతును ఈ ఉద్యమం పొందింది. అప్పటిగానీ అయ్యవార్లకు అర్థంకాలేదు. ఎన్ని ఆటంకాలు ఎగదోసింది ప్రభుత్వం! ఎంత దుష్ప్రచారం మొదలైంది. ఎంత దారుణంగా క్రూరంగా అణచివేయటానికి పూనుకొంది. రక్తం పారించింది. తలలు పగలగొట్టింది. చేతులు, కాళ్లు విరగగొట్టింది. రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ లు, ముండ్ల కంచెలు, దేశద్రోహ కేసులు, నిర్దాక్షిణ్య నిర్బంధాలు అన్నీ ఉపయోగించింది. ఇంకోవైపు నైతికతను దెబ్బతీస్తూ, విదేశీయుల సహకారంతో, మద్దతుతో నడుస్తోందని, సంఘవిద్రోహ శక్తులని, దేశ సమగ్రతను, శాంతిని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని, దొంగ దీక్షలు చేస్తున్నారని ఒక నీచ ప్రచారము చేసింది. నీళ్లను బంద్ చేసింది. కరెంటునూ, ఇంటర్నెట్ నూ, రహదారులను, మెట్రో స్టేషన్లను బంద్ పెట్టి నిలిపివేసింది.
ఇన్ని చేసినా, ఇంత విధ్వంసం ఒక రాజ్యం చేస్తున్నా… నిలకడగా నిబ్బరంగా వీటన్నింటినీ ఎదుర్కొని ఇన్ని రోజులుగా పోరాటం కొనసాగటం చరిత్రలో నిలిచిపోయే మహా సంఘటన. ఇది ఒక పరీక్ష పేపర్ లీకేజీ సమస్యే కాదు, విద్యావ్యవస్థ మొత్తం ప్రయివేటు, కార్పొరేట్ల చేతుల్లోకి పోవడం, పర్యవసానంగా వ్యాపారం, లాభాలు మాత్రమే లక్ష్యంగా మారింది. నిరుద్యోగం, పరిశ్రమల మూత, గ్రామీణ ప్రజల ఆదాయాల కోత, ధరల పెరుగుదల, హక్కుల అణచివేత అన్నిటి ప్రభావాల ప్రతిఫలనం ఈ ప్రతిఘటన. ప్రశ్నించినవాళ్లను, న్యాయం అడిగినవాళ్లను దేశద్రోహులుగా చూస్తూన్న ప్రభుత్వ నియంతృత్వ పోకడపై వెల్లువెత్తిన ఆగ్రహం ఇది.












