హైదరాబాద్, 27 July
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే ఇడబ్ల్యూఎస్ బిల్లుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు నష్టపోతారని భారత్ దేశ్ రాజ్య సమితి పార్టీ (బిడిఆర్ఎస్) జాతీయ అధ్యక్షుడు ఆకుల సంజీవరావు అన్నారు. ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దళిత బహుజన వర్గాలు, కాంగ్రెస్ పార్టీ పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆర్థికంగా వెనుకబడిన ఆధిపత్య వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం బహుజన వర్గాలకు అన్యాయం చేయడమేనని భారత్ దేశ్ రాజ్య సమితి పార్టీ (బిడిఆర్ఎస్) జాతీయ అధ్యక్షుడు ఆకుల సంజీవరావు అన్నారు. ఇడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇడబ్ల్యూఎస్ కు వ్యతిరేకంగా దళిత బహుజన వర్గాలు ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. సామాజిక న్యాయాన్ని ప్రధాన నినాదంగా చెబుతున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇడబ్ల్యూఎస్ కు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని సంజీవరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి నీట్, ఇతర పరీక్షల పేపర్ లీకులపై పోరాడి సాధించుకున్న విజయం ఢిల్లీ సిజెపికీ దక్కిందని ఆయన పేర్కొన్నారు.
సిజెపిని చూసైనా కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు తమ భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇందులో కీలక పాత్ర పోషించాలని, రాబోయే రోజుల్లో ఇడబ్ల్యూఎస్ పై వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. దేశంలో మెజారిటీ ప్రజలైన ఉత్పత్తి కులాలైన ఓబీసీలకు రాహుల్ అండగా నిలబడాలని, ఆయన అలాంటి రాజకీయాలు చేస్తే ప్రధానమంత్రి అయ్యేంత వరకు మద్దతు ఇస్తామని ఒక ప్రకటనలో ఆకుల సంజీవరావు తెలిపారు.












