నిర్మల్, నేడు
హిందువులకు ఎంతో విశిష్టమైన తొలి ఏకాదశి పండగను నేడు ఘనంగా జరుపుకోనున్నారు. ఆషాఢమాసంలో వచ్చే ఈ పండగను దేవశయన ఏకాదశి లేదా పేలాల పండగ అని కూడా పిలుస్తారు. ఈ సందర్భంగా వైష్ణవ ఆలయాలు భక్తుల కోసం ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి. ఉపవాసాలు, దానధర్మాలతో మోక్షం లభిస్తుందని అర్చకులు, వేదపండితులు చెబుతున్నారు.
హిందువులకు ఎంతో విశిష్టమైన పండగలలో మొదటిది తొలి ఏకాదశి. ఆషాఢమాసంలో వచ్చే ఈ పండగను దేవశయన ఏకాదశి లేదా పేలాల పండగ అని కూడా పిలుస్తారు. ఆషాఢశుద్ధ ఏకదశి తిథి సందర్భంగా నేడు పండగను జరుపుకుంటారని అర్చకులు, వేదపండితులు చెబుతున్నారు. ఏడాది కాలంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఇది మొదటిది కాగా, తెలుగు పండగలన్నీ దీంతోనే ప్రారంభమవుతాయి.
శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్లి నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటారని చెబుతారు. ఇక సూర్యుడు దక్షిణం వైపుకు మరలిన తరుణాన ఈ రోజు నుంచి దక్షిణాయానం ప్రారంభమవుతుందని, ఈ సందర్భంగా గోపద్మవ్రతాన్ని కార్తీకమాస శుక్లపక్షం వరకు జరుపుకుంటారు. ఇందుకోసం శ్రీవైష్ణవి ఆలయాలను నిర్వాహకులు ముస్తాబుచేయడంతో పాటు స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి భక్తుల దర్శనం కోసం ఏర్పాట్లు చేశారు.
గ్రీష్మ రుతువు ముగిసి, వర్ష రుతువు ప్రారంభమైన సందర్భంగా పండగను జరుపుకోవడం ఆనవాయితీ. తొలి ఏకాదశికి హైందవ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది. ఇది శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిలకు ఇష్టమైన పండగ కావడంతో అందరూ నేడు పూజలు చేస్తే పాపాలు తొలగిపోతాయని, పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం.
ఏకాదశి రోజున కొందరు చతుర్మాస వ్రతాలు ప్రారంభిస్తారు. సూర్యోదయానికి ముందే శ్రీహరిని పూజించి, విష్ణువు ప్రతిమను పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి చక్కెర పొంగళి నైవేద్యంగా పెడతారు. అంతేకాక కర్పూర హారతి ఇచ్చి భక్తులు ఉపవాసంతో వైష్ణవ ఆలయాలను సందర్శించి పూజలు చేస్తారు. గోపూజ చేయడం మంచిదని, పితృదేవతలకు ప్రీతికరమైన పేలాల పిండిని తినాలని పెద్దలు, అర్చకులు చెబుతున్నారు. ఉపవాసం ఉండి దానధర్మాలు చేస్తే మోక్షం సిద్ధిస్తుందని పేర్కొంటున్నారు.
తొలి ఏకాదశి పుణ్యదినాన్ని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానంలో మహా పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఆలయ కమిటీ చైర్మన్ ఆ మెడి శ్రీనివాస్ తెలిపారు. ఉదయం శ్రీ స్వామివారి సుప్రభాత సేవ, అభిషేకం, శ్రీ లక్ష్మీ స్తోత్ర పారాయణం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, మహా మంగళహారతి, సాయంత్రం 6 గంటలకు శ్రీ స్వామివారికి తులసి అర్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయ అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం, తొలి ఏకాదశి శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిలకు ఇష్టమైన పండగ కావడంతో ఈ రోజు పూజలు చేస్తే పాపాలు తొలగిపోతాయి. పుణ్యఫలం లభిస్తుంది. ఉపవాసం ఉండి దానధర్మాలు చేస్తే మోక్షం సిద్ధిస్తుంది.












