ఆదిలాబాద్, జూలై 17
వ్యవసాయ భూమిలో కోళ్ల పెంపక కేంద్రం నిర్మాణానికి అనుమతి పత్రం జారీ చేసేందుకు రూ.60 వేల లంచం తీసుకుంటున్న ఆదిలాబాద్ నీటిపారుదల శాఖకు చెందిన ఇద్దరు అధికారులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిని కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.
వ్యవసాయ భూమిలో కోళ్ల పెంపక కేంద్రం నిర్మాణానికి అవసరమైన అనుమతి పత్రం జారీ చేసేందుకు రూ.60 వేల లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ నీటిపారుదల శాఖకు చెందిన ఇద్దరు అధికారులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు.
ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం.. నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజనీరు రాథోడ్ విట్టల్, సహాయ ఇంజనీరు రూపావతి రమేష్‌లు సోనాల గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడి నుంచి అనుమతి పత్రం మంజూరు చేసేందుకు రూ.60 వేలు డిమాండ్ చేశారు. ముందస్తు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పన్నిన వలలో సహాయ ఇంజనీరు రూపావతి రమేష్ లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ఆయన వద్ద నుంచి రూ.60 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
విధి నిర్వహణలో నిజాయితీ పాటించకుండా అక్రమ ప్రయోజనం కోసం లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్లు ఏసీబీ పేర్కొంది. ఇద్దరు అధికారులను కరీంనగర్‌లోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు వెల్లడించింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు పేర్కొన్నారు.












