మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
వేల్పూర్ శ్రీ గోవింద గిరి స్వామి దివ్య యోగాశ్రమంలో జరుగుతున్న సప్త భజన కార్యక్రమం ఐదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వివిధ భజన మండలి బృందాలు పాల్గొని భక్తి గీతాలను ఆలపించాయి. ఆధ్యాత్మిక వక్త శ్రీ విశోక తీర్థ స్వామి మాట్లాడుతూ, గురువు ప్రాముఖ్యతను, భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని వివరించారు.
వేల్పూర్ శ్రీ గోవింద గిరి స్వామి దివ్య యోగాశ్రమంలో సప్త భజన సందర్భంగా భజనలతో ఆదివారం 5వ రోజుకు చేరుకుంది. లక్కోర గ్రామానికి చెందిన నవదుర్గా మహిళ భజన మండలి బృందం, శెట్పల్లి, దొన్కల్ గ్రామాలకు చెందిన వందేమాతరం భజన మండలి బృందం, బెజ్జోరకు చెందిన తోట శంకర్ భజన బృందం కళాకారులు "అమ్మను మరువకురా నాన్నను మరువకురా అమ్మా నాన్నలను మించిన దైవం సృష్టిలోనే లేదురా, హర హర మహాదేవా శంకరా హిమాలయాలకు రాలేమయ్యా మా ఊరిలోన నీ ఆలయాన..." అంటూ సుమధురంగా భజనలు ఆలపించి అందరినీ సంబ్రమాశ్చర్యాలకు గురి చేశారు. పాటలు ఎంతో అర్థవంతంగా జీవితాలతో ముడిపడి ఉన్నాయి.
ఆర్మూర్ పట్టణానికి చెందిన కొండ స్వరూప అశోక్ గౌడ్ దంపతులు అవధూత, స్పర్శజ్ఞాని శ్రీ శ్రీ శ్రీ గోవింద గిరి స్వామి పాదాలకు పాదుకాపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సత్యానందాశ్రమానికి చెందిన ఆధ్యాత్మిక వక్త శ్రీ విశోక తీర్థ స్వామి మాట్లాడుతూ, గురువు అంటే కేవలం ఒక మనిషి కాదని, మన అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించే దివ్యమైన తత్వమని అన్నారు. గురువు మనకు దారి చూపిస్తాడని, కానీ నడవాల్సింది మనమేనని, గురువు కటాక్షం లభించడం పూర్వజన్మ సుకృతమని, గురువును సేవించడం ఈ జన్మ సార్థకత అని, గురువు వాక్యాన్ని ఆచరించడం జీవిత పరమార్ధ సాధన అని తెలిపారు.
ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని కుటుంబ వ్యవస్థ కేవలం భారతదేశంలోనే ఉందని, రామాయణం ఏదో గ్రంథం కాదని, అది మన అందరి కుటుంబాల వ్యవస్థ అని అన్నారు. భజన కళాకారులకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ రాఘవేంద్ర స్వామి జ్ఞాపికల్ని బహుకరించారు. కార్యక్రమంలో కమిటీ కోశాధికారి కూషన్నగారి నర్సయ్య, కమిటీ సభ్యులు సాయిరాం బాలరాజ్, గడ్డం మల్లేష్, నోముల గంగారెడ్డి, కొరెం నర్సాగౌడ్, దమ్మాయి లక్ష్మి, కుంట సువర్ణ, కొండ అశోక్ గౌడ్, భజన కళాకారులు, సాయి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.












