పోక్సో కేసులో అరెస్టై ప్రస్తుతం చర్లపల్లి కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్‌కు ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన సాధారణ బెయిల్ మంజూరు చేసింది.
పోలీసులు భగీరథ్‌ను ఈ ఏడాది మే 16న పోక్సో కేసులో అరెస్టు చేశారు. అనంతరం న్యాయస్థానం ఆయనను రిమాండ్‌కు పంపడంతో చర్లపల్లి కారాగారంలో ఉంచారు.
గత నెల 20న బీబీఏ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్ మంజూరవడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. పరీక్షలు పూర్తయిన అనంతరం గత నెల 25న తిరిగి కారాగారానికి వెళ్లారు.
ఆ తర్వాత సాధారణ బెయిల్ కోసం ఆయన తరఫు న్యాయవాదులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గురువారం షరతులతో కూడిన సాధారణ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బెయిల్ నిబంధనల ప్రకారం లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాలని, అలాగే కేసులోని సాక్షులను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడరాదని న్యాయస్థానం భగీరథ్‌ను ఆదేశించింది.












