బాసర, జూలై 9
పెళ్లి కాకపోవడంతో మనస్తాపానికి గురై గోదావరి నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడిని బాసర పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. మహారాష్ట్రకు చెందిన 25 ఏళ్ల గజానన్ను పోలీసులు సురక్షితంగా బయటకు తీసి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల అప్రమత్తతను స్థానికులు అభినందించారు.
మహారాష్ట్ర రాష్ట్రంలోని ధర్మాబాద్ పట్టణం రాంనగర్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు గజానన్, గురువారం మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో బాసర గోదావరి నదిలో దూకి ప్రాణాలు తీసుకోవడానికి యత్నించాడు. పెళ్లి కాకపోవడం వల్ల మనస్తాపానికి గురై, మద్యానికి బానిసైన అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
అక్కడే విధుల్లో ఉన్న బాసర పోలీసు సిబ్బంది అప్రమత్తంగా స్పందించి వెంటనే గోదావరి నదిలో నుంచి యువకుడిని సురక్షితంగా బయటకు తీసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం అతనికి తగిన మానసిక ధైర్యం చెప్పి, జీవితంపై ఆశావహ దృక్పథం కలిగి ఉండాలని సూచిస్తూ అవగాహన కల్పించారు.
తర్వాత యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, అతని సాయినాథ్కు అప్పగించారు. ఈ ఘటనలో పోలీసుల అప్రమత్తతతో ఒక యువకుడి ప్రాణం నిలవడంతో స్థానికులు పోలీసు సిబ్బందిని అభినందించారు.












