హైదరాబాద్, 7 July
నైతిక విలువలు మంటగలిసిపోతున్నాయని చెప్పడానికి నిదర్శనంగా హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసి, మృతదేహాన్ని మహారాష్ట్ర సరిహద్దుల్లో పూడ్చిపెట్టిన ఘటన కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులో పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సమాజంలో మానవ సంబంధాలు, నైతిక విలువలు ఏమయ్యాయనే అనుమానం కలుగుతోంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరిగిన కొన్ని ఘటనలు వివాహ వ్యవస్థనే ప్రశ్నించేలా చేస్తున్నాయి. కొందరు భార్యలు తమ భర్తలను చంపుతుంటే, మరికొందరు సుపారీలు ఇచ్చి మరీ హత్య చేయిస్తున్నారు. వివాహేతర సంబంధాలు, ఆర్థిక కారణాలతో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఇలాంటి షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గతేడాది ఓ మహిళ తన భర్త కనిపించడం లేదని మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మహిళ ప్రవర్తనపై అనుమానం రావడంతో, ఆమె కాల్ రికార్డులను పరిశీలించారు. గతేడాది నుంచి ఒకే నంబర్‌కు అనేకసార్లు, గంటల తరబడి మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.
దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని చంపినట్లు ఆమె చెప్పింది. అనంతరం మృతదేహాన్ని మహారాష్ట్ర సరిహద్దు వరకు తరలించి పూడ్చిపెట్టినట్లు వెల్లడించింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, రీపోస్ట్మార్టంకు చర్యలు చేపట్టారు. ఈ ఘటన ప్రస్తుతం హైదరాబాద్‌లో సంచలనంగా మారింది.












