భీంగల్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 09
భీంగల్ పట్టణంలో 9 సంవత్సరాల విరామం తర్వాత ఈ నెల 12న ఆదివారం జరగనున్న ఊర పండుగ కోసం ఆరెత్తే కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టారు. స్థానిక మైసమ్మ గద్దె వద్ద కమిటీ సభ్యులు పూజలు నిర్వహించి, సాయిత్యం సేకరణ చేపట్టారు.
భీంగల్ పట్టణంలో 9 సంవత్సరాల తర్వాత ఈ నెల 12 ఆదివారం రోజున నిర్వహించనున్న ఊర పండుగ కొరకై గురువారం ఆరెత్తే కార్యక్రమానికి నాంది పలికారు. స్థానిక మైసమ్మ గద్దె వద్ద భీంగల్ పట్టణ సర్వసమాజ్ అభివృద్ధి కమిటీ, సలహా కమిటీ సభ్యులు మైసమ్మకు కొబ్బరికాయలు కొట్టి, బృందాలుగా విడిపోయి సాయిత్యాన్ని సేకరించారు.
సాయిత్యం ఇస్తే గ్రామదేవతల చల్లని చూపు ఉంటుందనే ప్రగాఢ విశ్వాసంతో మహిళలు సాయిత్యంతో పాటు ద్రవ్యాన్ని అందించారు. పట్టణంలోని పలు వీధుల గుండా కమిటీ సభ్యులు, పోతరాజులు సంచరించి, ఇంటిల్లిపాదికి నుదుట బండారు దిద్ది ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా సర్వసమాజ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పతాని కృష్ణ మాట్లాడుతూ, పట్టణ సర్వతోముఖాభివృద్ధికి ఊర పండగలు ఎంతో ఉపయుక్తమవుతాయని, 9 ఏళ్ల క్రితం జరిగిన ఈ పండుగను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రజలందరి ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని ఆయన అభ్యర్థించారు.
కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు తీగల రఘు, ప్రధాన కార్యదర్శి నిచ్చెమోల్ల రాజేశ్వర్, కోశాధికారి ఎస్పీ భూమేశ్వర్, కమిటీ సభ్యులు, సలహా కమిటీ సభ్యులు, గ్రామదేవతల పూజారులు బద్దం శ్రీనివాస్, బద్దం శివకుమార్ బృందం, పట్టణ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.











