మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 06
బైంసా మండలంలో నాసిరకం సోయా విత్తనాల సరఫరాతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మాటేగాం, హజ్గుల్, హంపోలి గ్రామాల్లో సోనం సీడ్స్ కంపెనీ 'తేజస్విని' రకం విత్తనాలు మొలకెత్తకపోవడంతో సుమారు వెయ్యి ఎకరాల్లో పంట దెబ్బతింది. జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) అంజి ప్రసాద్ బాధిత ప్రాంతాలను సందర్శించి, రైతుల వివరాలను సేకరించారు.
బైంసా మండలంలో నాసిరకం సోయా విత్తనాల కారణంగా వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. మాటేగాం, హజ్గుల్, హంపోలి తదితర గ్రామాల్లో సోనం సీడ్స్ కంపెనీకి చెందిన 'తేజస్విని' రకం సోయా విత్తనాలు విత్తిన పొలాల్లో పంట సరిగా మొలకెత్తకపోవడంతో దాదాపు వెయ్యి ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలోని పలు మండలాల్లో సైతం సోయా విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వ్యయ ప్రయాసలకు గురై అప్పులు చేసి పంట పొలాల్లో వేసిన సోయా విత్తనాలు మొలకెత్తక రెండవసారి సైతం విత్తడం ఆర్థికంగా భారంగా మారిందని రైతులు వాపోతున్నారు. విత్తనాల్లో నాణ్యత లోపించడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని రైతులు పేర్కొంటున్నారు. సరైన సమయంలో వర్షాలు కురువక ఆలస్యం కావడంతో పాటు విత్తనాలు మొలకెత్తక మళ్లీ వేయడం ఆర్థికంగా నష్టాన్ని మిగిలించిందని తెలిపారు.
రైతుల ఫిర్యాదుల మేరకు ఇటీవల జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) అంజి ప్రసాద్ బాధిత గ్రామాలను సందర్శించి పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి మొలక శాతం, సాగు విస్తీర్ణం, జరిగిన నష్టం తదితర వివరాలను సేకరించారు. ప్రాథమికంగా వెయ్యి ఎకరాల్లో నష్టం జరిగినట్లు గుర్తించినట్లు తెలిపారు.
క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా సమగ్ర నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామని డీఏఓ తెలిపారు. బాధిత రైతులకు నష్టపరిహారం అందించేలా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తామని, విత్తనాల నాణ్యతపై విచారణ నిర్వహించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అయితే అధికారులు ప్రతి సంవత్సరం వచ్చి పరిశీలనలు చేసి హామీలు ఇవ్వడం తప్ప సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేయగా, నాసిరకం విత్తనాల కారణంగా మళ్లీ విత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వర్షాకాలం ఆలస్యమవుతున్న తరుణంలో మరోసారి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడం తమ వల్ల కాదని వాపోయారు.
నాసిరకం విత్తనాలు సరఫరా చేసిన సంస్థపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. వెంటనే నష్టపరిహారం ప్రకటించి బాధిత రైతులను ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో మండలంలోని రైతులందరూ ఐక్యంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
బైంసా మండలంలోని సోయా రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వ్యవసాయ శాఖ నివేదిక ఆధారంగా ప్రభుత్వం త్వరితగతిన స్పందించి నష్టపరిహారం ప్రకటించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.












