బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 04
బోథ్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గుడాల అనీష్ ఆధునిక సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా రైతులు పెట్టుబడి వ్యయం తగ్గించుకొని అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. సోనాల మండల కేంద్రంలో జరిగిన పత్తి ఉత్పాదకత–కపాస్ క్రాంతి కార్యక్రమంలో ఆయన రైతులకు ఉచిత సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేశారు.
సోనాల మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం పత్తి ఉత్పాదకత–కపాస్ క్రాంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు ఉచిత సబ్సిడీ విత్తనాలను బోథ్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గుడాల అనీష్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాగు పద్ధతులను రైతులు అవలంబించడం ద్వారా పెట్టుబడి వ్యయం తగ్గి అధిక లాభాలు పొందవచ్చని అన్నారు. అధిక సాంద్రత సాగు విధానాన్ని అనుసరిస్తే తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ దిగుబడి సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలను ఎప్పటికప్పుడు పాటిస్తూ శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని, తద్వారా నాణ్యమైన దిగుబడులతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జంగాల బోజన్న, సుదర్శన్, రైతులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.









