నిర్మల్, జూలై 4
రాష్ట్రంలో పంట మార్పిడి విధానాలను విస్తృతంగా అమలు చేయడంతో పాటు ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు రైతులను చైతన్యపరచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
రాష్ట్రంలో పంట మార్పిడి విధానాలను విస్తృతంగా అమలు చేయడంతో పాటు ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు రైతులను అధికారులు చైతన్యపరచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. అలాగే వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వ్యవసాయ శాఖపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. 2026–27 సంవత్సరానికి రాష్ట్రంలో 85 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి అనుగుణంగా జిల్లాల్లో అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. పంట మార్పిడితో పాటు కూరగాయల సాగు, సూక్ష్మ సేద్య పద్ధతులను రైతులు అనుసరించేలా ప్రోత్సహించాలని చెప్పారు.
రైతులకు అవసరమైన మేరకు యూరియా, డీఏపీ, ఇతర కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉంచాలని, ఎరువులను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. దేశంలో ఫార్మర్ రిజిస్ట్రీ అమలులో 71.45 శాతం నమోదుతో తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
వర్షాకాలంలో కాలానుగుణ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధుల నివారణకు పారిశుద్ధ్య చర్యలు, వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంపునకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా చేస్తామని, ఎరువుల అక్రమ రవాణా నివారణకు పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. కాలానుగుణ వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వ ఆసుపత్రుల తనిఖీలు, వైద్య శాఖతో సమీక్షలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డీఆర్వో రాథోడ్ రమేష్, జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, డీపీవో శ్రీనివాస్, డీఈఓ భోజన్నతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.









