ఆదిలాబాద్ జిల్లా ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అయిన కుంటాల జలపాతం వద్ద ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా నీటి ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చే ప్రజలు, పర్యాటకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర అబ్జర్వర్, బోథ్ ఇన్చార్జ్ రాథోడ్ బాపూరావు విజ్ఞప్తి చేశారు.
జలపాతం వద్ద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ జలపాతం అంచులకు వెళ్లరాదని, సెల్ఫీలు తీసుకునేందుకు లేదా సాహసాలకు పాల్పడరాదని ఆయన హెచ్చరించారు. అధికారులు ఏర్పాటు చేసిన భద్రతా నిబంధనలు, హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
కుటుంబ సభ్యులతో వచ్చే పర్యాటకులు చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాకాలంలో ప్రకృతి అందాలను ఆస్వాదించే క్రమంలో ప్రాణాలకు ముప్పు కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన కుంటాల మండల కన్వీనర్ బానోత్ వసంత్ రావు మాట్లాడుతూ, ప్రజల భద్రతే ముఖ్యమని, అధికారులు జారీ చేసే సూచనలను ప్రతి ఒక్కరూ పాటించి ప్రమాదాలను నివారించాలని కోరారు.












