నిర్మల్, జూలై 9
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ఏర్పడే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. గురువారం రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ఏర్పడే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు.
గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, నీటి లభ్యత, సాగు పరిస్థితులు, ముందస్తు కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జూలై 30 వరకు వాతావరణ పరిస్థితులను నిరంతరం పరిశీలించాలని, వర్షపాతం ఆశించిన స్థాయిలో లేకపోతే వ్యవసాయంపై పడే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లు, ఆనకట్టలు, కాలువల్లో నీటి నిల్వలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి, అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాధార పంటల సాగును నిరంతరం పర్యవేక్షిస్తూ, వర్షాలు ఆలస్యమైతే రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, స్వల్పకాలిక పంటలు, నీటి పొదుపు విధానాలపై అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.
వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి శాఖ ముందస్తు కార్యాచరణ ప్రణాళిక (ప్లాన్ ఆఫ్ యాక్షన్) సిద్ధం చేసుకోవాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, సీపీఓ గంగారెడ్డి, నీటి పారుదల శాఖ అధికారి అనిల్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.










