మంచిర్యాల జిల్లా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 09
హైదరాబాద్ కొండాపూర్‌లో నూతనంగా నియమితులైన తెలంగాణ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ మారబోయిన రఘునాథ్ యాదవ్‌ను తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. గొర్రె కాపర్ల సమస్యలపై ఆయనకు వినతి పత్రం సమర్పించారు.
హైదరాబాద్ కొండాపూర్‌లోని నూతనంగా నియమించబడ్డ తెలంగాణ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ మారబోయిన రఘునాథ్ యాదవ్ నివాసంలో, తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో సన్మానించి, వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డా. కొమ్ము అశోక్ యాదవ్ మాట్లాడుతూ, 'రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గొర్రె కాపర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఫారెస్ట్ ప్రాంతాల్లో గొర్రెలు మేపుకోవడానికి అనుమతి లేకపోవడం. దీని కారణంగా వేలాది కుటుంబాలు జీవనోపాధి కోల్పోతున్నాయి' అని తెలిపారు.
'గొర్రెల మేత కోసం ఫారెస్ట్ ప్రాంతాల్లో గొర్రెలు మేపుకునే హక్కును కల్పిస్తూ నూతన జీవో విడుదల చేయాలని' కోరారు. అలాగే గొర్రెల బీమా, సబ్సిడీ, మేత పథకాలు సక్రమంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వలస గొర్రె కాపరులకు పక్కకుడారాలు, ఎల్ఈడి సోలార్ లైట్లు, రవాణా సౌకర్యం కోసం బోలో రాలు, డీసీఎంలు 75 శాతం సబ్సిడీతో ఇవ్వాలని, చదువుకున్న గొల్ల కురుమలకు పశుసంవర్ధక శాఖలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మినీ ఫాలో డైరీల ద్వారా పాల ఉత్పత్తి అభివృద్ధి కోసం 80 శాతం సబ్సిడీతో గేదెల కోసం రుణాలు మంజూరు చేయాలని వినతి పత్రం ద్వారా తెలిపారు.
దీనికి స్పందించిన చైర్మన్ మారబోయిన రఘునాథ్ యాదవ్, 'గొర్రె కాపర్ల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తాను. నూతన జీవో విషయంలో ఉన్నతాధికారులతో చర్చిస్తాను' అని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు హరిబాబు యాదవ్, డాక్టర్ రాజేష్, చందు నాయకులు పాల్గొన్నారు.











