మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 20
ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు అందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదేశాలు అమలు కాకపోవడంతో ఆయన సీరియస్ అయ్యారు. దీంతో ఆగస్టు 1న జమ కావాల్సిన వేతనాల విషయంలో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు తమ పరిధిలోని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల హాజరు వివరాలను వెంటనే తెప్పించుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు అందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ కొన్ని శాఖల్లో ఆదేశాలు అమలు కాకపోవడంతో ఇటీవల ఆయన అధికారులపై సీరియస్ అయ్యారు. వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. దీంతో ఆగస్టు 1వ తేదీన జమ కావాల్సిన వేతనాల విషయంలో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు తమ పరిధిలోని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల హాజరు వివరాలను తెప్పించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెల 20వ తేదీ కల్లా హాజరు వివరాలను సమర్పించాలని ఆదేశించారు. వెంటనే తమకు వివరాలను అందించాలని ఆయా విభాగాల అధిపతులు, బాధ్యులకు ఫోన్లు చేస్తున్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ శాఖల్లో దాదాపుగా ఐదు లక్షల వరకు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారని గుర్తించారు. వారందరికీ రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగానే ప్రతినెలా వేతనాలు ఒకటో తేదీన రావాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో ఉన్నతాధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఈసారి సీఎం ఆగ్రహానికి గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతో వారు అటెండెన్స్ కోసం వెంటపడుతున్నట్లుగా సమాచారం. తమ అటెండెన్స్ వివరాలను పదే పదే అడుగుతుండటంతో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారని సమాచారం.
గతంలో తాము నెలల తరబడి వేతనాలు ఇవ్వాలని పదే పదే అడిగినా, వేడుకున్నా, ఎంత మందిని కలిసినా ప్రయోజనం ఉండేది కాదని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు గుర్తుచేసుకుంటున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులపై సీరియస్ కావడంతో గతంలో పరిస్థితి రివర్స్ అయిందని వారు చెబుతున్నారు. గతంలో తాము అడిగినా వేతనాలు ఇవ్వని, జమ చేయని ఉన్నతాధికారులు ఇప్పుడు మాత్రం తమను అడిగి మరీ హాజరు వివరాలను తీసుకుంటున్నారని చెబుతున్నారు. లక్షలాదిగా ఉన్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈ పరిణామాలను చూసి ఆశ్చర్యపోవడమే కాదు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
ఇలా ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు వస్తే తమకు కూడా పని చేయడంలో సంతోషం, ఉత్సాహం ఉంటుందని, రెట్టించిన ఉత్సాహంతో పనిచేయగలుగుతామని చెబుతున్నారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ తోపాటుగా వారికిచ్చే రోజునే వేతనాలు రావడం, వారితో సమానంగా పనిచేయడానికి కూడా తమకు ఎలాంటి సంకోచం ఉండదని, తమ కుటుంబసభ్యులు కూడా సంతోషంగా ఉంటారని చెబుతున్నారు. ఇదే విధంగా ప్రతి నెలా వేతనాలు వచ్చేటట్టు చూడాలని కోరుతున్నారు. వచ్చే కొద్దిపాటి వేతనం అయినా సమయానికి అందితే ఇంటి అద్దెలు, ఈఎంఐలు, ఇతర ఖర్చులకు ఎలాంటి సమస్యలూ ఉండవని, బంధువులు, సమాజంలోనూ తమను చులకనగా చూడరని చెబుతున్నారు.












