ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వ శాఖల్లో కసరత్తు వేగం పుంజుకుంది. ఆగస్టు 1న వేతనాలు జమ చేయడానికి అవసరమైన హాజరు వివరాలను ఈ నెల 20వ తేదీలోపు సమర్పించాలని ఉన్నతాధికారులు ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో శాఖాధిపతులు, సంబంధిత అధికారులు ఉద్యోగుల అటెండెన్స్ వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు.
గతంలో నెలల తరబడి వేతనాల కోసం ఎదురుచూడాల్సి వచ్చేదని, ఇప్పుడు అధికారులు స్వయంగా హాజరు వివరాలు కోరుతుండటం ఆశ్చర్యంగా ఉందని కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు అందితే కుటుంబ ఆర్థిక నిర్వహణ సులభమవుతుందని, మరింత ఉత్సాహంతో విధులు నిర్వహించగలమని వారు అభిప్రాయపడుతున్నారు.
ఈసారి ముఖ్యమంత్రి ఆదేశాలు కచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.












