బాసర, జూలై 15
నిర్మల్ జిల్లా బాసరలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విస్మరిస్తున్నారని బాసర మండల జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే పలుమార్లు ఇళ్ల స్థలాలు కేటాయించినా, బాసరలో మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా కేటాయించలేదని వారు పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లా బాసర జిల్లా, మండల కేంద్రాల్లో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని బాసర మండల జర్నలిస్టులు కోరుతున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇప్పటికే రెండుసార్లు, భైంసా పట్టణంలో రెండుసార్లు, ముధోల్లో ఒకసారి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించినప్పటికీ, బాసర మండలంలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యాక్షేత్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచిన బాసరలో నిత్యం ప్రజా సమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ఆలయ విశేషాలు, ప్రజా ప్రయోజన అంశాలను ప్రజల ముందుకు తీసుకువస్తున్న జర్నలిస్టులను అధికారులు, ప్రజాప్రతినిధులు విస్మరించడం బాధాకరమని వారు పేర్కొన్నారు.
స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ స్పందించి బాసర మండలంలో విధులు నిర్వహిస్తున్న అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయించేలా చర్యలు తీసుకోవాలని బాసర జర్నలిస్టుల యూనియన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇతర ప్రాంతాల్లో ఇచ్చినట్లే బాసర జర్నలిస్టులకు కూడా సమాన న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.












