Tirupati/Naidupeta (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 15
తెలంగాణలో మరో రెండు విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా వరంగల్ (మామునూరు) విమానాశ్రయ నిర్మాణాన్ని జూన్ 2, 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని ఆయన అభినందించారు.
తెలంగాణలో మరో రెండు విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ముఖ్యంగా వరంగల్ (మామునూరు) విమానాశ్రయ నిర్మాణాన్ని జూన్ 2, 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
విమానాశ్రయాల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కీలకమని, భూసేకరణ పూర్తయితేనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. వరంగల్ విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ చరిత్రలా జరిగిందని, ఇంత త్వరగా ఒక్క ఎకరా తక్కువ లేకుండా భూమిని సేకరించి అప్పగించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరును ఆయన ప్రశంసించారు.
తాజాగా ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి, ముఖ్యంగా వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల ఏర్పాటుపై ఇరునేతలు సుదీర్ఘంగా చర్చించారు. భేటీ అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చర్చల వివరాలను వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును ఎంతో పట్టుదలతో ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. వరంగల్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా ఎంతో ఇష్టమైన ప్రాంతమని, అక్కడి చరిత్ర, సంస్కృతి దృష్ట్యా ప్రధాని కూడా పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు.
వరంగల్ విమానాశ్రయం వద్ద ప్రస్తుతం 700 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని, బౌండరీ వాల్ నిర్మాణానికి టెండర్లు వేశామని, రన్‌వే నిర్మాణానికి సంబంధించిన టెండర్లు కూడా సిద్ధంగా ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు. రాబోయే మూడు, నాలుగు వారాల్లో మెయిన్ టెర్మినల్ బిల్డింగ్ కోసం టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు.
జూన్ 2, 2028 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించాలన్న సీఎం రేవంత్ రెడ్డి కోరిక మేరకు నిర్దేశిత టైమ్‌లైన్ ప్రకారం పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వరంగల్ సంస్కృతి, కాకతీయ కట్టడాలు, అక్కడి ఆలయాల వైభవం ఉట్టిపడేలా టెర్మినల్ భవనాన్ని నిర్మిస్తామని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.
దేశంలో ఏవియేషన్ రంగాన్ని ఒక హబ్‌గా మార్చాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని, ఆయన ప్రధాని అయ్యాక దేశంలో 90కి పైగా విమానాశ్రయాలు నిర్మించామని, ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న తెలంగాణ విమానాశ్రయాల అభివృద్ధి తన హయాంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నానని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.












