తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి, అవయవాలు కోల్పోయిన మలిదశ ఉద్యమకారుడు పిడమర్తి నాగరాజు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు, బీసీ జేఏసీ కన్వీనర్ మారం శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
సోమవారం మిర్యాలగూడలో పిడమర్తి నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా, మారం శ్రీనివాస్, బీసీ జేఏసీ కో-కన్వీనర్ చేగోండి మురళీ యాదవ్, మారం సుభాషిని శ్రీనివాస్ కలిసి నాగరాజును శాలువాతో సత్కరించి, మెమెంటోను అందజేశారు. మారం సుభాషిని శ్రీనివాస్ వ్యక్తిగతంగా కొంత ఆర్థిక సహాయం కూడా అందించారు.
ఈ సందర్భంగా మారం శ్రీనివాస్, చేగోండి మురళీ యాదవ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం నాగరాజుకు కొంత ఆర్థిక సాయం చేసిందని, అయితే నేటి తెలంగాణ ప్రజా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.
తెలంగాణ కోసం అవయవాలు కోల్పోయి, ప్రస్తుతం దీనమైన పరిస్థితిలో ఉన్న పిడమర్తి నాగరాజు కుటుంబం, వారి తండ్రి పిడమర్తి ధర్మయ్య పక్షవాతంతో బాధపడుతున్నారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో పిడమర్తి నాగరాజుకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. త్యాగాలు చేసిన ఉద్యమకారులను ఆదుకుంటేనే తెలంగాణ రాష్ట్రం సంతోషిస్తుందని పేర్కొన్నారు.










