Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
జిల్లా వ్యాప్తంగా నమోదయ్యే వర్షపాతం, భూగర్భ జలాల వివరాలను ఖచ్చితత్వంతో నమోదు చేసి సంబంధిత శాఖలకు సకాలంలో అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూగర్భ జలాల కొలతల కేంద్రాన్ని, అక్కాపూర్ లోని వర్షపాత మాపక కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
జిల్లా వ్యాప్తంగా నమోదయ్యే వర్షపాతం వివరాలను ఖచ్చితత్వంతో ఎప్పటికప్పుడు నమోదు చేసి సంబంధిత శాఖలకు సకాలంలో అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
బుధవారం నిర్మల్ పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూగర్భ జలాల కొలతల కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షపాతం, భూగర్భ జలాల నమోదును పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా వివరాలను నమోదు చేయాలని సూచించారు.
అనంతరం నిర్మల్ గ్రామీణ మండలం అక్కాపూర్ గ్రామంలోని విద్యుత్ ఉపకేంద్రం ప్రాంగణంలో ఉన్న వర్షపాత మాపక కేంద్రాన్ని తనిఖీ చేశారు. వర్షపాతం కొలత, నమోదు విధానంపై అధికారులను అడిగి తెలుసుకుని, నమోదైన వివరాలను వెంటనే సంబంధిత శాఖలకు చేరవేయాలని ఆదేశించారు. ప్రతి నమోదులో ఖచ్చితత్వం ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
తదనంతరం ఎల్లపల్లి సమీపంలో నిర్మాణంలో ఉన్న నూతన కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్, పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే పూర్తయిన పనులను పరిశీలించి, మిగిలిన పనులను నాణ్యతలో రాజీ లేకుండా నిరంతర పర్యవేక్షణతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సీపీవో గంగారెడ్డి, తహసిల్దార్ ప్రభాకర్, రహదారులు–భవనాల శాఖ కార్యనిర్వాహక ఇంజనీరు సుభాష్, భూగర్భ జలాల శాస్త్రవేత్త వంశీకృష్ణతో పాటు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












