రాజమండ్రి (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 31
చారిత్రక రాజమండ్రి నగర అభివృద్ధిపై పాలకులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పీసీ) వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ కోరారు. నగరంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల ప్రభావం, నేరాలు, పారిశుధ్య సమస్యలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి కాలుష్య నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చారిత్రక రాజమండ్రి నగర అభివృద్ధిపై పాలకులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పీసీ) వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ కోరారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని, 2015 రాజమండ్రి పుష్కరాల్లో పనిచేసిన పోలీసు, రెవెన్యూ అధికారులను పూర్తి స్థాయిలో పుష్కర విధులకు తరలించాలని ప్రభుత్వాన్ని కోరారు. నగరంలో మాదకద్రవ్యాల ప్రభావం, నేరాలు, పారిశుధ్య సమస్యలు పెరుగుతున్నాయని, నిఘా వ్యవస్థ మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
గోదావరిలో ఏపీ పేపర్ మిల్లు నుంచి వ్యర్థాలు కలుస్తున్నాయన్న ఆరోపణలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గోదావరి జలాల కాలుష్యంపై గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ప్రస్తుతం కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పేపర్ మిల్లు కాలుష్య నివారణకు కఠిన చర్యలు చేపట్టాలని, అవసరమైతే పుష్కరాలకు మూడు నెలల ముందుగా మిల్లును మూసివేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అయితే, ఈ అంశంపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు వాస్తవ పరిస్థితులను వెల్లడించాల్సి ఉందన్నారు.
నగరంలో తాగునీరు, వాయు కాలుష్యం, పారిశుధ్య సమస్యలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పుష్కర ఘాట్లు, కోటిలింగాల ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ మెరుగుపర్చాలని సూచించారు. మురుగునీరు, తాగునీటి పైపుల సమస్యలపై సంబంధిత విభాగాలు తక్షణమే స్పందించాలని కోరారు.
రాజమండ్రికి ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని, నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని మేడా శ్రీనివాస్ అన్నారు. కోటిలింగేశ్వరస్వామి ఆలయాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడంతో పాటు గోదావరి తీరాన్ని ఆధునిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచించారు.
ఈ సమావేశానికి ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. డి.వి. రమణమూర్తి, దుడ్డే త్రినాథ్, ఎం.డి. హుస్సేన్, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్‌కుమార్, వాడపల్లి జ్యోతిష్, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, బసా సోనియా, మట్టపర్తి తులసి, లంక వీర వెంకట సత్యనారాయణ, చల్లా సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.












